జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆధునిక సాంకేతికతను జోడించి విద్యార్థులు రూపొందించిన వినూత్న ప్రాజెక్ట్ ప్రతిష్టాత్మక వేదికపై గుర్తింపు పొందడం కైకలూరు నియోజకవర్గానికి గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్, కైకలూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం కైకలూరు మండలం వరహాపట్నంలోని తన నివాసంలో కైకలూరు జాగృతి స్కూల్ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన సరికొత్త ప్రాజెక్ట్ విశేషాలను ఎమ్మెల్యే ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు.
జాగృతి స్కూల్ విద్యార్థులు ఇంటర్నెట్ సహాయంతో ‘పొలాల పంట పర్యవేక్షణ వ్యవస్థ’ (Crop Monitoring System) పేరుతో ఒక అద్భుతమైన ప్రాజెక్ట్‌ను రూపకల్పన చేశారు. వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేలా రూపొందించిన ఈ ప్రాజెక్ట్ అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘PanIIT ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026’ కు ఎంపిక కావడం విశేషం. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను, వారి సృజనాత్మక ఆలోచనలను ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు. చిన్న వయస్సులోనే సమాజానికి, ముఖ్యంగా రైతులకు ఉపయోగపడేలా సాంకేతికతను జోడించి ఆలోచించడం అభినందనీయమని కొనియాడారు.
విద్యార్థులను ఈ స్థాయికి తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన స్కూల్ యాజమాన్యం మరియు ఉపాధ్యాయ బృందాన్ని ఎమ్మెల్యే ప్రశంసించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో దాగి ఉన్న అసాధారణ ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి సాంకేతిక వేదికలు ఎంతగానో దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో విద్యార్థులు మరిన్ని నూతన ఆవిష్కరణలతో శాస్త్ర సాంకేతిక రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. తమ ప్రతిభను గుర్తించి అభినందించిన ఎమ్మెల్యేకు విద్యార్థులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Slug: jagriti-school-students-meet-mla-kamineni-srinivas-paniit-2026
