జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదన్న భయంతోనే వైయస్సార్సీపీ నాయకులు ఎన్నికల బరి నుంచి పారిపోతున్నారని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రజలకు ముఖం చూపించలేకనే ఆ పార్టీ నేతలు కోర్టుల మాటున దాక్కుంటున్నారని మండిపడ్డారు. గత ఐదేళ్ల తమ పాలనలో ప్రజలను రాబందుల కన్నా దారుణంగా పీక్కుతిన్నారన్న వాస్తవం ఆ పార్టీకి ఇప్పుడే అర్థమైందని, అందుకే పార్టీ తరఫున ఫండ్స్ ఇస్తామంటూ బతిమాలినా పోటీ చేయడానికి కేడర్ ముందుకు రాకపోగా అందరూ చేతులెత్తేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో గొడ్డలి రాజకీయాలకు, ప్రజా వ్యతిరేక విధానాలకు ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ చోటు లేదని ఆయన స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజారంజకమైన సుపరిపాలన అందిస్తున్నామని ఆళ్ళ హరి పేర్కొన్నారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మరియు గుంటూరు పశ్చిమ శాసనసభ్యులు గళ్ళా మాధవి ఆధ్వర్యంలో గుంటూరు నగరం శరవేగంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని కొనియాడారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా ప్రజలు కూటమి వైపే నిలబడతారని, ప్రతి స్థానంలోనూ అఖండ విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికలను ఏ రూపంలోనైనా అడ్డుకోవాలని చూసి పారిపోవడం వైసీపీ నాయకుల పిరికిపంద చర్యలకు నిదర్శనమని ఆళ్ళ హరి పేర్కొన్నారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజా తీర్పు నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. గుంటూరు నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు భారీ విజయాలు సాధిస్తారని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు పూర్తి మద్దతు ఇస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.
Slug: alla-hari-ycps-fear-local-elections-guntur-development
