జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు మరియు ఆడబిడ్డలకు భద్రత పూర్తిగా కరువైందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగ మల్లీశ్వరి తీవ్రస్థధ్ధిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలపై నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆమె ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో మహిళల రక్షణ కోసం అప్పట్లో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఒక అన్నలా నిలబడి ‘దిశ యాప్’ను అందుబాటులోకి తెచ్చారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం దాన్ని రద్దు చేసి కేవలం ‘శక్తి యాప్’గా పేరు మార్చడమే తప్ప ఒరిగిందేమీ లేదని విమర్శించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలపై రోజువారీగా సగటున 45 కేసులు నమోదవుతున్నాయని నాగ మల్లీశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు ఏవిధమైన రక్షణ కల్పిస్తున్నామని ప్రభుత్వాన్ని ఆమె నిలదీశారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిని దూషించడంలో ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో మహిళల రక్షణపై ప్రభుత్వానికి ఎందుకు లేదని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను ఆమె తీవ్రంగా ప్రశ్నించారు.
మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో, వారికి భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నాగ మల్లీశ్వరి విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలు మాని, రాష్ట్రంలో శాంతిభద్రతలను పకడ్బందీగా అమలు చేసి మహిళలకు పూర్తి రక్షణ కల్పించాలని వైయస్ఆర్ సీపీ తరఫున ఆమె డిమాండ్ చేశారు.
Slug: ysrcp-naga-malleshwari-criticizes-ap-government-women-safety-home-minister-anitha
