జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: అమలాపురం పట్టణ పరిధిలోని మున్సిపల్ ఎన్నికల రాజకీయం మరింత వేడెక్కింది. పట్టణంలోని ఇరవై ఎనిమిదవ వార్డులో కూటమి బలపరిచిన భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మోకా వెంకట సుబ్బారావు గెలుపును కాంక్షిస్తూ మెగా అభిమాన గణం విస్తృతంగా రంగంలోకి దిగింది. అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రవణం స్వామినాయుడు స్వయంగా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొని వార్డులోని ప్రతి వీధిలో విస్తృతంగా పర్యటించారు. మెగా అభిమానుల ముఖ్య ప్రతినిధులతో కలిసి ఆయన గడప గడపకూ తిరుగుతూ స్థానిక ఓటర్లను ఆప్యాయంగా పలకరించి కూటమి అభ్యర్థి విజయానికి సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రచార సభలో రవణం స్వామినాయుడు మాట్లాడుతూ, అమలాపురం పట్టణ సమగ్ర వికాసం కోసం కూటమి అభ్యర్థుల విజయం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థి నల్లా శ్రీధర్ గారి ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసు గుర్తుకు, అలాగే ఇరవై ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మోకా వెంకట సుబ్బారావు గారి ఎన్నికల గుర్తు అయిన కమలం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. అభ్యర్థి మోకా వెంకట సుబ్బారావు గారు ఆదినుంచీ మెగాస్టార్ చిరంజీవి గారికి వీరాభిమానిగా ఉంటూ ప్రజాసేవలో ముందంజలో ఉన్నారని, అందుకే ఆయన విజయం కోసం మెగా అభిమానులంతా ఒక్కటై ప్రచారంలో భాగస్వాములవుతున్నామని వివరించారు.
రవణం స్వామినాయుడు రాకతో ఇరవై ఎనిమిదవ వార్డు పరిధిలోని కూటమి కార్యకర్తల్లో, మెగా అభిమానుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. అభ్యర్థి విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని వార్డులో ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని శ్రేణులు నిర్ణయించాయి. ఈ ప్రచార కార్యక్రమంలో మెగా అభిమానుల రాష్ట్ర ప్రతినిధులు యేడిద శ్రీను, నల్లా చిట్టిబాబు, బోణం సత్య వరప్రసాద్, యర్రమిల్లి విశ్వేశ్వరరావులతో పాటు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నల్లా శ్రీధర్ గారి సోదరీమణులు, కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
