జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: కైకలూరు నియోజకవర్గ పరిధిలోని కలిదిండి మండల స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడినాడ గ్రామంలో రాజకీయ సందడి నెలకొంది. ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థులు నేడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తాడినాడ బాబు గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలు, ప్రచార సరళిపై వారంతా సీనియర్ నేతతో సమగ్రంగా చర్చించారు.
ఈ భేటీలో ఎన్డీఏ కూటమి బలపరిచిన కలిదిండి జడ్పీటీసీ అభ్యర్థి నల్లగొపుల చలపతి గారితో పాటు ఎంపీటీసీ ఒకటి అభ్యర్థి మార్రాజు గారు, ఎంపీటీసీ రెండు అభ్యర్థి నరసయ్య గారు పాల్గొన్నారు. తాడినాడ బాబు గారికి పుష్పగుచ్ఛాలు అందజేసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం గ్రామంలో అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికపై ఆయన సలహాలు, సూచనలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సీనియర్ నాయకులు తాడినాడ బాబు గారు మాట్లాడుతూ, కూటమిలోని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల శ్రేణులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉందని, ప్రజా సంక్షేమ పథకాలను గడప గడపకూ చేరవేస్తూ ఓటర్లను చైతన్యపరచాలని పిలుపునిచ్చారు. అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమికి చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
