జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: గన్నవరం నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు మరియు గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే కోట్లాది రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. బుధవారం బాపులపాడు మండల పరిధిలోని పలు ప్రాంతాలలో పల్లె పండుగ మూడో విడత మరియు ఇతర ప్రత్యేక నిధులతో చేపట్టనున్న సుమారు రూ. 4.45 కోట్ల విలువైన నూతన రోడ్లు, రహదారుల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు.
షెడ్యూల్ ప్రకారం సాయంత్రం అయిదు గంటలకు బాపులపాడు మండలం కోడూరుపాడు నాగేంద్రస్వామి ఆలయం నుంచి శోభనాద్రిపురం వరకు, అలాగే శోభనాద్రిపురం మసీదు నుంచి వీరవల్లి కొమ్మూరు రోడ్డు వరకు సుమారు రూ. 1.80 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ మరియు బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శంకుస్థాపన చేస్తారు. అనంతరం సాయంత్రం ఆరు గంటలకు బాపులపాడు, మడిచర్ల, కొయ్యూరు, సింగన్నగూడెం గ్రామాల్లోని ఐటీఐ కళాశాల రోడ్డు మరియు సాయిబాబా మందిరం సమీపంలో రూ. 1.27 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ సీసీ రోడ్డు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు.
అదేవిధంగా సాయంత్రం ఆరున్నర గంటలకు ప్రత్యేక నిధులతో రూ. 1.38 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఎంఎన్కే రోడ్డు నుంచి బిళ్లనపల్లి రహదారి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. నియోజకవర్గంలో ప్రతీ గ్రామం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలను వేగవంతంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
Slug: gannavaram-mla-yarlagadda-venkatrao-development-works-foundation-bapulapadu
