జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో ‘సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమం అత్యంత ఘనంగా మరియు విజయవంతంగా నిర్వహించారు. పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి పోలే శాంతి నాయకత్వంలో మరియు తిరువూరు పట్టణ అధ్యక్షులు వెంపాటి అబ్రహం మణిరత్నం ఆధ్వర్యంలో తిరువూరు షాదీఖానా వేదికగా ఈ వేడుకలు కొనసాగాయి.
ఈ సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని నాలుగు మండలాలు మరియు పది సెక్టార్ల నుంచి విచ్చేసిన సుమారు 425 మంది అంగన్వాడీ కార్యకర్తలను బీజేపీ నేతలు ఘనంగా సన్మానించారు. అంగన్వాడీ కార్యకర్తల పిలుపు మేరకు ఈ వేడుకకు విచ్చేసిన గర్భిణీ స్త్రీలకు సాంప్రదాయబద్ధంగా సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. గర్భిణులను శాలువాలతో సత్కరించి, వారికి చీరలు, జాకెట్లు, గాజులు, పసుపు, కుంకుమలు అందజేసి ఆశీర్వదించారు. సీపీడీవో బి. కృష్ణకుమారి అధ్యక్షతన అంగన్వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన పౌష్టికాహార పదార్థాల ఎగ్జిబిషన్‌ను బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పోలే శాంతి, పట్టణ అధ్యక్షులు వెంపాటి అబ్రహం మణిరత్నం పరిశీలించి నిర్వాహకులను అభినందించారు.
ఈ సందర్భంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న వివిధ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అంగన్వాడీ కార్యకర్తలకు, ప్రజలకు నేతలు వివరించారు. సమాజంలో చిన్నారులు, తల్లుల ఆరోగ్య పరిరక్షణలో అంగన్వాడీల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లల తల్లిదండ్రులు, స్థానిక బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Slug: tiruvuru-bjp-seva-sankalp-abhiyan-anganwadi-felicitation
