జన గళం ఎంటర్టైన్మెంట్ డెస్క్: నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ది ప్యారడైజ్ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. సెప్టెంబర్ 24న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, విడుదలకు ఒక రోజు ముందుగా సెప్టెంబర్ 23న సాయంత్రం 6.30 గంటలకు ప్రత్యేక ప్రీమియర్ షో నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ ప్రత్యేక ప్రదర్శనకు జీఎస్టీతో కలిపి టికెట్ ధరను రూ.500గా నిర్ణయించింది.
సినిమా విడుదలైన సెప్టెంబర్ 24 నుంచి 27 వరకు థియేటర్లలో టికెట్ ధరల పెంపునకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ వ్యవధిలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై జీఎస్టీతో కలిపి రూ.48 వరకు అదనపు ధర వసూలు చేసుకునే అవకాశం కల్పించింది. మల్టీప్లెక్స్‌లు, ప్రత్యేక థియేటర్లలో ఒక్కో టికెట్‌పై రూ.95 వరకు అదనపు ధరకు అనుమతి ఇచ్చింది. అనంతరం సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.23, మల్టీప్లెక్స్‌లు, ప్రత్యేక థియేటర్లలో రూ.45 వరకు అదనపు ధరలు అమల్లో ఉంటాయి.
విడుదల రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా రోజుకు ఐదు ప్రదర్శనలు నిర్వహించుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ది ప్యారడైజ్ చిత్రానికి ప్రారంభ రోజుల్లో అదనపు ప్రదర్శనలతో ప్రేక్షకులకు సినిమా చూసే అవకాశాలు పెరగనున్నాయి. నాని, శ్రీకాంత్ ఓదెల గతంలో కలిసి పనిచేసిన నేపథ్యంలో ఈ చిత్రంపై అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. సెప్టెంబర్ 24న సినిమా థియేటర్లలోకి రానుంది.
ఇదిలా ఉండగా, టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కమిటీకి రూ.కోటి అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. థియేటర్లలో మాదకద్రవ్యాలు, డ్రగ్స్, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రకటనలను కూడా ప్రదర్శించాల్సి ఉంటుందని ప్రభుత్వ అనుమతుల్లో పేర్కొన్నట్లు సమాచారం.
