జన గళం ప్రత్యేక రాజకీయ విశ్లేషణ: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో పార్టీ ఇన్‌ఛార్జి లేకపోయినప్పటికీ, కార్యకర్తలే సైన్యమై క్రమశిక్షణతో పనిచేస్తూ నియోజకవర్గ గెలుపోటములను నిర్దేశించే స్థాయికి జనసేన పార్టీ ఎదిగిందని క్షేత్రస్థాయి పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2014 నుంచి 2024 వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ జనసేన పార్టీ తన బలాన్ని, ఓటు బ్యాంకును తిరుగులేకుండా నిరూపించుకుంటూ వచ్చింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులో భాగంగా కూటమి అభ్యర్థి విజయం సాధించడానికి జనసేన క్షేత్రస్థాయి క్యాడర్ నిరంతర శ్రమే ప్రధాన బలమని స్థానిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ముఖ్యంగా ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలోని 2024 ఎన్నికల ఓట్ల గణాంకాలను పరిశీలిస్తే, మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి, పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోడే ప్రసాద్‌కు వచ్చిన ఓట్ల మధ్య వ్యత్యాసం కేవలం సుమారు 3,000 ఓట్లు మాత్రమే. అంటే ఉయ్యూరు పట్టణంలో జనసేన పార్టీకి సమానమైన, తిరుగులేని పట్టు ఉందని స్పష్టమవుతోంది. దీంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు ధర్మంలో భాగంగా ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించినా కూటమి విజయం నల్లేరు మీద నడకేనని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాజీ అభ్యర్థి జోగి రమేష్ స్థానిక క్యాడర్‌కు దూరంగా ఉండటం, నూతనంగా వచ్చిన ఇన్‌ఛార్జి చక్రవర్తికి స్థానికంగా పట్టు లేకపోవడం వంటి రాజకీయ శూన్యత కూటమికి, ముఖ్యంగా జనసేనకు భారీ మెజారిటీని జోడించే ప్రధాన అంశాలుగా మారనున్నాయి.
