జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ళ సుబ్రహ్మణ్యం అనారోగ్యంతో విజయవాడలో మృతి చెందారు. ఆయన మృతివార్త తెలుసుకున్న ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను, సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుతో కలిసి గాళ్ళ సుబ్రహ్మణ్యం పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సామినేని ఉదయభాను మాట్లాడుతూ కాపు సామాజిక వర్గ అభివృద్ధి కోసం గాళ్ళ సుబ్రహ్మణ్యం అందించిన సేవలను గుర్తుచేశారు. సామాజిక వర్గ అభ్యున్నతికి ఆయన సుదీర్ఘకాలం పాటు కృషి చేశారని పేర్కొన్నారు. కాపు సామాజిక వర్గ సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో ఆయన చురుకైన పాత్ర పోషించారని తెలిపారు. కాపు రిజర్వేషన్ల సాధన కోసం నిర్వహించిన వివిధ ఉద్యమాల్లో గాళ్ళ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారని సామినేని ఉదయభాను పేర్కొన్నారు. కాపుల్లోని వెనుకబాటుతనాన్ని గుర్తించి రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడంలో ఆయన కృషి చేశారని తెలిపారు. సామాజిక వర్గ ప్రయోజనాల కోసం ఆయన చేసిన పోరాటం, సేవలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. గాళ్ళ సుబ్రహ్మణ్యం మృతి కాపునాడు వర్గంతో పాటు ఆయనతో అనుబంధం ఉన్నవారిలో విషాదాన్ని నింపింది. ఆయన కుటుంబ సభ్యులకు సామినేని ఉదయభాను తదితరులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు.