జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ పరిధిలోని నారపరెడ్డిపల్లి గ్రామంలో జనసేన పార్టీలో భారీ చేరికలు జరిగాయి. రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి శ్రీ యల్లటూరు శ్రీనివాసరాజు గారి నాయకత్వంపై, ఆయన అభివృద్ధి దృక్పథంపై సంపూర్ణ విశ్వాసంతో నారపరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ నాయకుడు కొంగాణి రఘు యాదవ్ ఆధ్వర్యంలో సుమారు 150కి పైగా కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. పార్టీలోకి వచ్చిన రఘు యాదవ్‌తో పాటు మహిళలు, యువత, ఆయన అనుచరులకు యల్లటూరు శ్రీనివాసరాజు స్వయంగా పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా యల్లటూరు శ్రీనివాసరాజు గారు మాట్లాడుతూ.. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలను నమ్మి పార్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఉంటుందని భరోసా ఇచ్చారు. నారపరెడ్డిపల్లి గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమం మరియు స్థానిక సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా పార్టీ పనిచేస్తుందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి అందరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇంత పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు స్వచ్ఛందంగా తరలివచ్చి జనసేనలో చేరడం వల్ల నారపరెడ్డిపల్లిలో పార్టీకి మరింత రాజకీయ బలం చేకూరిందని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
