జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: విజయవాడ రూరల్ మండలం పరిధిలోని రామవరప్పాడు–ప్రసాదంపాడు జాతీయ రహదారిపై కురుస్తున్న వర్షాల కారణంగా వర్షపు నీరు నిలిచిపోకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం శాసనసభ్యులు శ్రీ యార్లగడ్డ వెంకట్రావు పంచాయతీ అధికారులను ఆదేశించారు. ప్రసాదంపాడు హిందూ శ్మశానవాటికకు వెళ్లే మార్గంలోని సంపు వద్ద డ్రైనేజీ ప్రవాహ మార్గంలో భారీగా మట్టి, పూడిక పేరుకుపోవడంతో ప్రధాన రహదారిపైకి వర్షపు నీరు చేరి రాకపోకలకు అంతరాయం కలుగుతున్న విషయాన్ని ఆయన గుర్తించారు.
ఈ సమస్యపై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంటనే స్పందించి, సంపును తెరిచి పూడికతీత పనులను వేగవంతం చేయాలని, మురుగునీటి కాల్వలను పూర్తిగా శుభ్రపరిచి వర్షపు నీరు సాఫీగా కిందకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ విప్ ఆదేశాలతో తక్షణమే రంగంలోకి దిగిన పంచాయతీ ఇంజనీరింగ్, శానిటేషన్ అధికారులు జేసీబీల సహాయంతో పూడికతీత పనులను ముమ్మరం చేశారు. జాతీయ రహదారిపై ఎక్కడా వరద నీరు నిలవకుండా ప్రవాహానికి ఆటంకాలు లేకుండా పనులు పూర్తి చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. క్షేత్రస్థాయి సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కారం చూపిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చొరవను స్థానిక ప్రజలు, వాహనదారులు అభినందించారు.
