జన గళం ప్రత్యేక రాజకీయ ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, అధికార భాగస్వామ్యంపై జనసేన శ్రేణుల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్‌తో కూటమి విజయానికి వెన్నెముకగా నిలిచిన జనసేన పార్టీకి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు ధర్మం ప్రకారం 33 శాతం వాటా కేటాయించాలని కార్యకర్తలు గట్టిగా గళమెత్తుతున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ మాట ప్రకారం కూటమిలో గౌరవప్రదమైన ప్రాధాన్యత దక్కాలని, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల్లో 33 శాతం సీట్లను జనసేన తీసుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలు లెక్కలతో సహా ఒక ప్రత్యేక ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.
ఆ వివరాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17 కార్పొరేషన్లలో 6 మేయర్ స్థానాలు, 34 డిప్యూటీ మేయర్లలో 11 స్థానాలు జనసేనకు కేటాయించాలని కోరుతున్నారు. అలాగే గ్రామీణ స్థానిక సంస్థల్లో 28 జడ్పీ చైర్మన్ పదవుల్లో 10, మొత్తం 660 జడ్పీటీసీ స్థానాల్లో 217, మొత్తం 688 ఎంపీపీ స్థానాల్లో 227 జనసేన ఖాతాలోకి రావాలని స్పష్టం చేస్తున్నారు. ఇక క్షేత్రస్థాయి పంచాయతీరాజ్ వ్యవస్థలో మొత్తం 10,047 ఎంపీటీసీలలో సుమారు 3,300, మొత్తం 13,295 సర్పంచ్ స్థానాల్లో 4,350 స్థానాలు జనసేన పార్టీ అభ్యర్థులకు కేటాయించాలన్న విశ్లేషణను శ్రేణులు పెద్ద ఎత్తున పంచుకుంటున్నాయి. కూటమిలో ఐక్యతను కాపాడుకుంటూనే, పార్టీ కోసం నిరంతరం పోరాడిన క్షేత్రస్థాయి సైనికులకు రాజకీయ గుర్తింపు దక్కాలంటే ఈ 33 శాతం వాటాను కచ్చితంగా సాధించుకోవాలని జనసేన క్యాడర్ బలంగా కోరుకుంటోంది.
