హైదరాబాద్: మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి సేవా భావాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజ హితం కోసం నిరంతరం పరితపిస్తున్న రక్తదాత శ్రీ K.N.S. కళ్యాణ్ చక్రవర్తి గారు (B +ve) మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. నగరంలోని ప్రఖ్యాత చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో ఆయన 19వ సారి రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు.
గత ఎన్నో సంవత్సరాలుగా ఆపదలో ఉన్న బాధితులకు ప్రాణదానం చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఆయన, చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లోనే కాకుండా అత్యవసర సమయాల్లో వివిధ ఆసుపత్రులు, ఇతర బ్లడ్ బ్యాంకులలో కలిపి ఇప్పటివరకు మొత్తం 59 సార్లు రక్తదానం చేశారు. ఆయన నిస్వార్థ సేవా నిరతిని చిరంజీవి ఐ & బ్లడ్ సెంటర్ ప్రతినిధులు ప్రత్యేకంగా కొనియాడారు. కాగా, శ్రీ కళ్యాణ్ చక్రవర్తి గారు త్వరలోనే దర్శకుడిగా బాధ్యతలు చేపట్టి వెండితెరపై ఒక మంచి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సినీ దర్శకుడిగా ఆయన ప్రతిభను చాటుకుంటూ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆయన కుటుంబాన్ని భగవంతుడు ఆయురారోగ్యాలతో చల్లగా చూడాలని చిరంజీవి ఐ & బ్లడ్ సెంటర్ వర్గాలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశాయి.
