మచిలీపట్నం: మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి కార్పొరేటర్లు, పోటీ చేసిన అభ్యర్థులతో స్థానిక వేడుక కన్వెన్షన్ హాల్‌లో అభినందన సభ మరియు ఆత్మీయ సమావేశం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ శ్రీ కొనకళ్ల నారాయణరావు గారు, నూతనంగా ఎన్నికైన నగర మేయర్ శ్రీమతి అబ్దుల్ అబీదా గారు, బీజేపీ నాయకులు శ్రీ పంతం గజేంద్ర గార్లతో కలిసి కృష్ణా జిల్లా డీసీఎంఎస్ (DCMS) చైర్మన్, మచిలీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ శ్రీ బండి రామకృష్ణ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మచిలీపట్నం కార్పొరేషన్‌లో కూటమి అభ్యర్థుల విజయం ప్రజా సంక్షేమానికి, కూటమి ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన మేయర్, కార్పొరేటర్లు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ బందరు నగరాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. కూటమి నాయకులు, కార్యకర్తల సమష్టి కృషి వల్లే ఈ అద్భుత విజయం సాధ్యమైందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, నూతన కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
