అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మరింత వేగం పుంజుకోనుంది. రాష్ట్రంలో ఇప్పటికే 100 పట్టణ స్థానిక సంస్థలకు (యూఎల్బీ) ఎన్నికల ప్రక్రియ ప్రారంభించిన రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC), వివిధ కారణాలతో వాయిదా పడిన మిగిలిన 23 పట్టణ స్థానిక సంస్థలకు సైతం ఈ వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. నవంబర్ 11 లేదా 12 తేదీల్లో అధికారిక నోటిఫికేషన్ జారీ చేసి, నవంబర్ 24 లేదా 25 తేదీల్లో పోలింగ్ నిర్వహించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలు ఉండగా.. తొలి దశలో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు ఎన్నికల నగారా మోగింది. మిగిలిపోయిన 23 సంస్థల్లో శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కాకినాడ, మంగళగిరి-తాడేపల్లి వంటి 4 ప్రధాన కార్పొరేషన్లతో పాటు 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయి. ముందస్తు ఏర్పాట్లు, న్యాయపరమైన అంశాల సమీక్ష పూర్తవుతుండటంతో వీటికి లైన్ క్లియర్ అయింది.
మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ సమరానికి నవంబర్ 13న తొలి విడత నోటిఫికేషన్ విడుదల కానుండగా.. నవంబర్ 26, నవంబర్ 29, డిసెంబర్ 2 తేదీల్లో మూడు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో అటు పట్టణ, ఇటు గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను సమన్వయం చేస్తూ డిసెంబర్ 2 నాటికి రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఎస్ఈసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ 23 పట్టణ స్థానిక సంస్థల షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన వెలువడితే పూర్తి స్పష్టత రానుంది.
