కోడూరు: సీజనల్ వ్యాధుల నివారణ, ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా కోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) వైద్యాధికారుల ఆదేశాల మేరకు కోడూరు గ్రామ పంచాయతీ పరిధిలో దోమల లార్వా నిర్మూలన కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టారు. పంచాయతీ కార్యనిర్వాహక అధికారి (ఈవో) ఆధ్వర్యంలో గ్రామంలోని మురుగునీటి కాల్వలలో దోమల లార్వా వృద్ధి చెందకుండా ‘ఎబేట్’ రసాయన ద్రావణాన్ని పిచికారీ చేయించారు.
ఈ యాంటీ లార్వా కార్యకలాపాలను కోడూరు పీహెచ్సీ వైద్యాధికారులు డాక్టర్ రాణి సంయుక్త, డాక్టర్ విజయకుమార్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన సూచనలు చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నిల్వ నీటిలో దోమలు చేరకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కోడూరు పంచాయతీ ఈవో మల్లికార్జునరావు, హెల్త్ సూపర్వైజర్ జి. కోటేశ్వరరావు, హెల్త్ అసిస్టెంట్లు అప్పికట్ల తారకమస్తానరావు, బోలెం వీరస్వామిలతో పాటు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
