జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: కాపునాడు జాతీయ అధ్యక్షులు, ప్రముఖ సామాజిక నాయకులు శ్రీ గాళ్ళ సుబ్రహ్మణ్యం గారి ఆకస్మిక మరణం పట్ల పలువురు రాజకీయ, సామాజిక రంగ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రవణం స్వామినాయుడు నేడు దివంగత సుబ్రహ్మణ్యం గారి నివాసానికి స్వయంగా విచ్చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం గాళ్ళ సుబ్రహ్మణ్యం గారి కుమారుడు గాళ్ళ అరవింద్ మరియు కుటుంబ సభ్యులను రవణం స్వామినాయుడు ఆత్మీయంగా పరామర్శించి, వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం గారితో తనకు దశాబ్దాలుగా ఉన్న సాన్నిహిత్యాన్ని, ఆయన సామాజిక సేవలను, ఉద్యమ స్మృతులను రవణం స్వామినాయుడు గుర్తుచేసుకున్నారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడిన నిబద్ధత కలిగిన వ్యక్తిని కోల్పోవడం తీరని లోటని పేర్కొన్నారు. ఈ సంతాప కార్యక్రమంలో మాచవరం శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడు సోడిశెట్టి కృష్ణప్రసాద్, జనసేన పార్టీ నాయకులు లకనం శ్యామ్ ప్రసాద్, ఇల్లూరి సుగుణ బాబు, సురేష్, కటిక రాకేష్ నాథ్, అలాగే మెగా ఫోర్స్ ప్రతినిధి ఎం. మల్లికార్జున్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
