జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: కృష్ణా నదిపై నూతన బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది. వరద జలాలు సముద్రం పాలు కాకుండా ఒడిసిపట్టడంతో పాటు రాజధాని పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెంపొందించడం, స్థానిక తాగు, సాగునీటి అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ప్రకాశం బ్యారేజీకి ఎగువన, దిగువన కొత్త బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపేందుకు సన్నాహాలు ముమ్మరమయ్యాయి. ఇందులో భాగంగా ప్రకాశం బ్యారేజీ దిగువన విజయవాడ-అవనిగడ్డ కరకట్ట మార్గంలోని పెనమలూరు మండలం “చోడవరం” మరియు గుంటూరు జిల్లా “పెదకొండూరు” గ్రామాల మధ్య నూతన బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదన తెరపైకి రావడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
చోడవరం వద్ద గనుక బ్యారేజీ రూపుదిద్దుకుంటే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య రవాణా వ్యవస్థ మెరుగుపడటంతో పాటు, కరకట్ట ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం, వాణిజ్య కార్యకలాపాలు ఊహించని రీతిలో ఊపందుకుంటాయని స్థానికులు, రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో వచ్చే వరద నీటిని ఒడిసిపట్టి స్థానిక ఆయకట్టుకు పుష్కలంగా నీరందించే అవకాశం కలుగుతుంది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఈ ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించి త్వరితగతిన నిధులు మంజూరు చేస్తే, విజయవాడ శివారు ప్రాంతాల రూపురేఖలే మారిపోతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
