జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: కృష్ణా జిల్లా పామర్రు మండలం నిమ్మలూరు గ్రామంలో వినాయక చవితి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా గ్రామంలో కొలువుదీరిన విఘ్నేశ్వరుడి సన్నిధిలో నిర్వహించిన విశేష పూజలు మరియు అన్నసమారాధన మహోత్సవంలో పామర్రు శాసనసభ్యులు శ్రీ వర్ల కుమార్ రాజా గారు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ శ్రీ తాడిశెట్టి నరేష్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, పామర్రు సమగ్రాభివృద్ధి చెందాలని వారు ప్రార్థించారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా అన్నప్రసాదాలను వడ్డించారు. ఈ కార్యక్రమంలో కూటమికి చెందిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల సీనియర్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, భక్తులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
