జన గళం విద్యా విభాగం, ఉయ్యూరు: ఉయ్యూరు వేదికగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ మరియు క్విజ్ పోటీల్లో కొమ్మారెడ్డి పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ పోటీల్లో జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు చెందిన మండల స్థాయి విజేతలు 32 జట్లుగా (96 మంది విద్యార్థులు) పాల్గొని పోటీపడ్డారు.
వీరిలో ప్రైవేటు పాఠశాలల విభాగంలో కొమ్మారెడ్డి విద్యార్థులు జి. నేత్ర రామతేజ (10వ తరగతి), జి. యక్షప్రియ (9వ తరగతి), ఎం. విష్ణు కావ్య (8వ తరగతి) అత్యుత్తమ ప్రతిభతో జిల్లా స్థాయిలోనే మొదటి స్థానాన్ని సాధించారు. ఈ అద్భుత విజయంతో వీరు నవంబర్ 1, 2, 3 తేదీల్లో భీమవరంలో జరగనున్న రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలకు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు ఎంపికయ్యారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా సైన్స్ అధికారి శ్రీ జాకీర్ హుస్సేన్, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ టి. సురేష్, ఉయ్యూరు చెరుకు పరిశోధన స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ శ్రీ సత్యప్రియ, విశ్రాంత శాస్త్రవేత్త శ్రీ బి.వి. వెంకటేశ్వరరావు, స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ తదితరులు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. సైన్స్ పోటీల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఎల్లప్పుడూ ముందంజలో ఉంచుతున్న కొమ్మారెడ్డి పాఠశాల యాజమాన్యాన్ని జిల్లా సైన్స్ అధికారి ప్రత్యేకంగా కొనియాడారు. జిల్లా స్థాయిలో విజయకేతనం ఎగురవేసిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ కొమ్మారెడ్డి కిషోర్, సొసైటీ ప్రెసిడెంట్ కొమ్మారెడ్డి చైతన్య, ప్రధానోపాధ్యాయులు ఎన్. శ్రీనివాసరావు, ఉపాధ్యాయ బృందం ఘనంగా అభినందించారు.
