జన గళం రాజకీయ విభాగం, మచిలీపట్నం: భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ఆలోచనల సమాహారమైన ‘మన్ కీ బాత్’ 138వ భాగాన్ని కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం పార్టీ కార్యాలయంలో ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు అత్యంత ఉత్సాహంగా వీక్షించారు. ప్రధాని మోదీ ప్రసంగం దేశాభివృద్ధికి, ప్రజా చైతన్యానికి నిరంతరం స్ఫూర్తినిస్తుందని నేతలు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గనుల శాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ శ్రీ కొనకళ్ల నారాయణరావు, జనసేన పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ బండి రామకృష్ణ, టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ గొర్రెపాటి గోపీచంద్ మరియు బీజేపీ జిల్లా ముఖ్య నేతలు పాల్గొన్నారు. ‘మన్ కీ బాత్’ వీక్షణ అనంతరం కూటమి ముఖ్య నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణ, కూటమి ఉమ్మడి వ్యూహాలు మరియు క్షేత్రస్థాయిలో మూడు పార్టీల సమన్వయంపై సమగ్రంగా చర్చించారు. కూటమి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి, స్థానిక పోరులో క్లీన్‌స్వీప్ సాధించేలా శ్రేణులు సన్నద్ధం కావాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
