జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై చింతలపూడి నియోజకవర్గ ఇంచార్జ్ కంభం విజయ రాజు అధ్యక్షతన స్థానిక నాయకులు, కార్యకర్తలతో ఒక కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీ పరంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేసే దిశగా ఈ సమావేశం కొనసాగింది. పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నాయకులంతా పూర్తి సమన్వయంతో పనిచేసి ఎన్నికలకు సిద్ధం కావాలని ఈ సమావేశంలో పిలుపునిచ్చారు.
ఈ సమావేశానికి పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, జిల్లా పార్టీ అధ్యక్షులు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వీరితో పాటు పోలవరం నియోజకవర్గ ఇంచార్జ్ తెల్లం బాలరాజు, దెందులూరు నియోజకవర్గం ఇంచార్జ్ కొఠారు అబ్బాయి చౌదరి, కృష్ణాజిల్లా పార్లమెంటు పరిశీలకులు జెట్టి గురునాధ రావు, చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులు దాసరి రమేష్, జంగారెడ్డిగూడెం టౌన్ పార్టీ అధ్యక్షులు కర్పూరం గుప్తా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీ శ్రేణులకు తగిన దిశానిర్దేశం చేశారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడ కూడా ఏకగ్రీవాలకు అవకాశం లేకుండా పార్టీ తరఫున ప్రతి స్థానంలోనూ అభ్యర్థులు పోటీ చేసేలా ముందస్తు వ్యూహాలతో చర్యలు చేపట్టాలని నాయకులకు సూచించారు. నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు సమన్వయంతో అడుగులు వేయాలని కోరారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో నిరంతరం కష్టపడి పనిచేసే ప్రతి నాయకుడు మరియు కార్యకర్తకు భవిష్యత్తులో తప్పకుండా తగిన గుర్తింపు, సముచిత ప్రాధాన్యత ఉంటుందని నేతలు భరోసా కల్పించారు. ఈ సమావేశానికి పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు.
Slug: ysrcp-local-body-elections-review-meeting-in-jangareddygudem
