జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండల కేంద్రంలోని పరిషత్ కార్యాలయంలో మహిళాభివృద్ధి మరియు శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ పోషణ మాసోత్సవాలు – 2026 అత్యంత వైభవంగా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మన అంగన్వాడీ – మన బాధ్యత నినాదంతో ఈ ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఈ వేడుకకు ప్రత్తిపాడు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి వరుపుల సత్యప్రభ గారు ముఖ్య అతిథిగా విచ్చేయగా, వారితో పాటు జిల్లా బీజేపీ అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, జిల్లా బీజేపీ మహిళా నాయకురాలు సాయి అపర్ణ, కాకినాడ మాజీ మేయర్ సుంకర పావని తదితర ప్రముఖులు విశేషంగా పాలుపంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా గర్భవతులను ఘనంగా సన్మానించి, వారికి పౌష్టికాహార విలువల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. గర్భధారణ సమయంలో మహిళలు తీసుకోవాల్సిన సరైన ఆహారం, ఆరోగ్య జాగ్రత్తలు మరియు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవల గురించి వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో అంగన్వాడీ కార్యకర్తల సేవలు ఎంతో కీలకమని, తల్లులు మరియు శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు, లింగంపర్తి పీఏసీఎస్ చైర్మన్ పెంటకోట మోహన్, ప్రధాన కార్యదర్శి గంగిరెడ్ల మణికంఠ, ఉపాధ్యక్షులు పలివెల వెంకటేష్, జగ్గంపేట ఆత్మ కమిటీ సభ్యులు మాగాపు వీరబాబు, డేగల సత్యనారాయణ, వరుపుల నాగేశ్వరరావు, లారా, తేజా తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ప్రత్తిపాడు నియోజకవర్గం సమన్వయకర్త మేడిశెట్టి సూర్యకిరణ్ బాబీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Slug: eleswaram-nutrition-month-masotsavam-varupula-satyaprabha
