జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: మచిలీపట్నం పరిసర ప్రాంతంలో ఆపదలో ఉన్న ఒక అంగవైకల్య బాధితుడికి స్వేచ్ఛ ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ మానవత్వంతో అండగా నిలిచి మరోసారి తన సేవా స్ఫూర్తిని చాటుకుంది. నాగాయలంక మండలం కమ్మలమోడు గ్రామానికి చెందిన పదహారేళ్ల కొక్కిలిగడ్డ సాయి శ్యామ్ ప్రసాద్ చిన్ననాటి నుంచే తీవ్రమైన అంగవైకల్యంతో బాధపడుతూ, నడవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు. తండ్రి లేకపోవడంతో ఆ కుటుంబానికి పెద్ద దిక్కు కరువై, కనీస అవసరాలను సైతం స్వయంగా తీర్చుకోలేని దుర్భర పరిస్థితిలో జీవనం సాగిస్తున్నాడు. బాలుడి దయనీయ పరిస్థితిని కుటుంబ సభ్యులు ట్రస్ట్ నిర్వాహకుల దృష్టికి తీసుకువెళ్లడంతో వారు వెంటనే స్పందించి సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు.
బాధితుడి దీనస్థితిని తెలుసుకున్న ట్రస్ట్ వ్యవస్థాపకుడు షేక్ రఫీ మరియు ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ తదితరులు వెంటనే స్పందించి మచిలీపట్నంలో ఆ కుటుంబానికి అవసరమైన సహాయం అందజేశారు. బాధిత కుటుంబానికి రెండు నెలలకు సరిపడే నిత్యావసర సరుకులు, తాజా కూరగాయలతో పాటు మూడు వేల రూపాయల నగదును అందజేసి తమ ఉదారత చాటుకున్నారు. ఈ సందర్భంగా లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలను ఆదుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని, శ్యామ్ ప్రసాద్ పరిస్థితి తెలుసుకుని తమ వంతు సహాయం అందించామని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు.
ట్రస్ట్ వ్యవస్థాపకుడు షేక్ రఫీ మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా ఇలాంటి పేద, అట్టడుగు వర్గాల కుటుంబాలకు చేయూతనిచ్చేలా మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ వితరణ కార్యక్రమంలో లంకిశెట్టి వనజ, లంకిశెట్టి సాయి ఫణి సంతోష్, ఆశ నాగ మౌనిక, మాదిరెడ్డి బాబా, కే. సుజాత, దుర్గా, కన్యా, ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ మల్లి, కనపర్తి ఆంథోనీ, రమేష్, బోయిన నాగరాజు, మురళీమోహన్, కే. రాజు, ఎం.డి. భాషి, ఎం.డి. రఫి, సామ, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆపద సమయంలో ఆదుకున్న ట్రస్ట్ నిర్వాహకులకు బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Slug: swechha-educational-charitable-trust-helps-disabled-boy-machilipatnam
