రచన: జన గళం అమరావతి డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం జనసేన పార్టీ సమాయత్తమవుతోంది. ఎన్నికల ప్రక్రియను క్షేత్రస్థాయిలో మరింత పకడ్బందీగా ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయం, పర్యవేక్షణ కోసం త్వరలోనే సరికొత్త నూతన కమిటీలను నియమించాలని పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.
ఈ మేరకు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. గతంలో నియమించిన సమన్వయకర్తలు, ముగ్గురు సభ్యులతో కూడిన సమన్వయ కమిటీలు మరియు వాటికి అనుబంధంగా పనిచేస్తున్న సపోర్ట్ టీమ్స్ ఇకపై ఏమాత్రం చెల్లుబాటు కావని స్పష్టం చేశారు. అలాగే గతంలో ఏర్పాటైన 25 మంది సభ్యులతో కూడిన పార్లమెంట్ కమిటీలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే, ఇటీవల రాష్ట్ర స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల పర్యవేక్షణ నిమిత్తం ప్రత్యేకంగా నియమించిన ఐదుగురు సభ్యుల సమన్వయ కమిటీ మరియు ప్రధాన కమిటీలు యథావిధిగా తమ విధుల్లో కొనసాగుతాయని పార్టీ స్పష్టం చేసింది. ఎన్నికల వ్యూహాలను మరింత పదును పెట్టేందుకే ఈ మార్పులు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
