రచన: జన గళం పెడన డెస్క్: ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడి, సాగునీరందక పంటలు ఎండిపోయి అల్లాడుతున్న పెడన నియోజకవర్గ అన్నదాతల సమస్యపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. నియోజకవర్గంలోని నాలుగు మండలాలను తక్షణమే కరువు మండలాలుగా గుర్తించి ఆదుకోవాలని జనసేన పార్టీ కృష్ణా జిల్లా కార్యదర్శి కూనసాని నాగబాబు గత కొంతకాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ డిమాండ్ చేస్తూ వచ్చారు. ఆయన విజ్ఞప్తులు, రైతుల ఆవేదనను పరిగణనలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం పెడన, గూడూరు, కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాలను అధికారికంగా కరువు మండలాలుగా ప్రకటిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయంపై జనసేన జిల్లా కార్యదర్శి కూనసాని నాగబాబు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రైతుల పక్షాన నిలబడి క్షేత్రస్థాయి సమస్యలను నిరంతరం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిన కూనసాని నాగబాబుకు నియోజకవర్గంలోని నాలుగు మండలాల రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. కరువు మండలాల ప్రకటనతో అన్నదాతలకు ప్రభుత్వం నుంచి తగిన పరిహారం, ఆర్థిక ఊరట లభిస్తుందని స్థానిక నాయకులు పేర్కొన్నారు.
