రచన: జన గళం విజయవాడ/మచిలీపట్నం డెస్క్: విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన జగన్మాత శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అక్టోబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు, జనసేన పార్టీ సీనియర్ నేత వల్లభనేని బాలశౌరిని ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం అధికారులు ఎంపీ వల్లభనేని బాలశౌరిని స్వయంగా కలిసి దసరా నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను, అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు. పది రోజుల పాటు అమ్మవారు రోజుకో విశేష అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారని, లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం చేపట్టిన విస్తృత ఏర్పాట్లను ఈ సందర్భంగా అధికారులు ఎంపీకి వివరించారు. పవిత్రమైన నవరాత్రులలో ఇంద్రకీలాద్రిపై జరిగే పూజా కార్యక్రమాల్లో పాల్గొని దుర్గమ్మ ఆశీస్సులు అందుకోవాలని కోరారు. ఆహ్వానం పట్ల ఎంపీ బాలశౌరి హర్షం వ్యక్తం చేస్తూ, ఉత్సవాలు దిగ్విజయంగా సాగాలని, అమ్మవారి కటాక్షం రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
