జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: విజయవాడ వేదికగా అత్యంత వైభవంగా నిర్వహించనున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మరియు ప్రతిష్టాత్మక ‘విజయవాడ ఉత్సవ్-2.0’ వేడుకలకు హాజరుకావాల్సిందిగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా ఇన్‌చార్జ్ సత్యకుమార్ యాదవ్, లోక్‌సభ సభ్యులు కేశినేని శివనాథ్ (కేశినేని చిన్ని), జి.యం. హరీష్ బాలయోగిలు ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి సాదరంగా ఆహ్వానించారు. దేశ రాజధానిలో కేంద్ర మంత్రిని ప్రత్యేకంగా కలిసిన ప్రజాప్రతినిధులు, అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి ఈ ఉత్సవాలకు రావాలని కోరారు.
ఈ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారి దివ్య ఆశీస్సులు పొందడంతో పాటు, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవాన్ని, ఆధ్యాత్మిక పరిమళాలను దేశవ్యాప్తంగా చాటిచెప్పేలా ఈ ఏడాది విజయవాడ ఉత్సవ్‌ను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తూ నిర్వహిస్తున్న ఈ వేడుకలు జాతీయ స్థాయిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు. విజయవాడ ఉత్సవ్-2.0 విశిష్టతను, చారిత్రక ప్రాధాన్యతను వివరిస్తూ కేంద్ర మంత్రికి అధికారిక ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఆహ్వానాన్ని సాదరంగా స్వీకరించిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ ఉత్సవాల విజయవంతానికి తన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పర్యాటక మరియు సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవాడ ఉత్సవ్‌ను తిలకించేందుకు సాధ్యమైనంత వరకు వస్తానని ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ భేటీలో రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక వారసత్వాన్ని జాతీయ స్థాయిలో మరింత ముందుకు తీసుకెళ్లడంపై కూడా చర్చలు జరిగాయని నాయకులు వెల్లడించారు.
Slug: central-minister-gajendra-singh-shekhawat-invited-vijayawada-utsav-20
