జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నారు. ఇందులో భాగంగానే రెండు రోజుల క్రితం ఆయన పమిడిముక్కల మండలం తాడంకి గ్రామంలోని జాతీయ రహదారి అండర్‌పాస్ ప్రాంతాన్ని సందర్శించి క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. అండర్‌పాస్ వద్ద రహదారి పూర్తిగా దెబ్బతిని ఉండడం వల్ల వాహనదారులు, స్థానికులు పడుతున్న తీవ్ర ఇబ్బందులను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజల కష్టాలను స్వయంగా గమనించిన ఆయన తక్షణమే స్పందించి జిల్లా కలెక్టర్‌తో పాటు నేషనల్ హైవేస్ అథారిటీ ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య తీవ్రతను వివరించారు.
ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా చొరవతో వెంటనే స్పందించిన అధికారులు అండర్‌పాస్ పరిధిలో రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్న పెద్ద పెద్ద గోతులను పూడ్చి తాత్కాలిక మరమత్తులు చేపట్టారు. అయితే రోడ్ల మరమత్తులు పూర్తయినప్పటికీ, అక్కడ ఇప్పటికీ డ్రైనేజీ సమస్య అలాగే వేధిస్తోందని స్థానికులు ఎమ్మెల్యేకు తెలిపారు. వర్షాకాలంలో నీరు నిలిచిపోయి ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతున్న విషయాన్ని ఆయన గుర్తించారు. ఈ నేపథ్యంలో కేవలం తాత్కాలిక పనులతో సరిపెట్టకుండా, అండర్‌పాస్ వద్ద డ్రైనేజీ సమస్య పునరావృతం కాకుండా పకడ్బందీగా డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలని సంబంధిత ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను ఎమ్మెల్యే గట్టిగా ఆదేశించారు.
ప్రజా సమస్యల పట్ల కూటమి ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగా స్పందిస్తుందని, నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా భరోసా కల్పించారు. రహదారులు, డ్రైనేజీ వంటి ప్రాథమిక సదుపాయాలు మెరుగ్గా ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి రోడ్ల మరమత్తులు చేయించడం పట్ల తాడంకి గ్రామానికి చెందిన వాహనదారులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. డ్రైనేజీ సమస్యకు కూడా త్వరలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందనే నమ్మకాన్ని స్థానికులు వ్యక్తం చేశారు.
Slug: tadamki-underpass-road-drainage-issues-pamarru-mla-varla-kumar-raja
