జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ పరిధిలోని రెడ్డిగూడెం మండలం కూనపరాజుపర్వ గ్రామానికి చెందిన ఒక నిరుపేద కుటుంబానికి వైద్య చికిత్స నిమిత్తం భారీ ఆర్థిక సహాయం అందింది. అనారోగ్యంతో బాధపడుతున్న కూనపరాజుపర్వ గ్రామానికి చెందిన కొనకళ్ల వీరబాబు వైద్యం కోసం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో, మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ ప్రత్యేక చొరవ చూపారు. బాధితుడి పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే సిఫారసు మేరకు ప్రభుత్వం నుంచి రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల విలువైన ఎల్.ఓ.సీ మంజూరైంది.
ఈ సహాయానికి సంబంధించిన పత్రాలను గ్రామంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు లబ్ధిదారుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అత్యవసర వైద్యం ఆర్థిక భారంగా మారకుండా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అండగా నిలుస్తోందని నాయకులు ఈ సందర్భంగా తెలిపారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదలకు మెరుగైన వైద్యం అందేలా చేయడంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ నిరంతరం శ్రమిస్తున్నారని, ఎల్.ఓ.సీ ల మంజూరులో ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని కొనియాడారు.
మైలవరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే కార్యాలయం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని నాయకులు స్పష్టం చేశారు. ముఖ్యంగా వైద్య సహాయం, ఎల్.ఓ.సీ మరియు ముఖ్యమంత్రి సహాయనిధి వంటి అంశాలపై ప్రజలకు అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తూ కార్యాలయ సిబ్బంది విస్తృత సేవలందిస్తున్నారని తెలిపారు. తమ కష్టకాలంలో ఆదుకుని వైద్య సహాయం అందేలా సహకరించిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌కు, ప్రభుత్వ అధికారులకు లబ్ధిదారుడి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
Slug: vasantha-krishna-prasad-loc-medical-aid-kunaparajuparva-reddygudem
