జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: కృష్ణా జిల్లాలో జాతీయ అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణ కార్యక్రమం (National Iodine Deficiency Disorders Control Programme – NIDDCP) అత్యంత పకడ్బందీగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన 30 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHC) పరిధిలో అయోడిన్ లోప రుగ్మతలపై వైద్యాధికారులు ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నారు. చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ చేపట్టిన ఈ సర్వేలో భాగంగా పలు కీలక పరీక్షలు, నమూనాల సేకరణ ప్రక్రియను ముమ్మరం చేశారు.
ఈ సర్వేలో ప్రతి గ్రామం నుంచి 6 నుంచి 12 సంవత్సరాల వయస్సు గల 90 మంది చిన్నారులను ఎంపిక చేసి గాయిటర్ (థైరాయిడ్ గ్రంథి వాపు) పరీక్షలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా, ఆయా కుటుంబాల్లో వినియోగిస్తున్న వంట ఉప్పు నమూనాలతో పాటు, చిన్నారుల నుంచి మూత్ర నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపిస్తున్నారు. సేకరించిన ఈ ఉప్పు మరియు మూత్ర నమూనాలను విజయవాడలోని స్టేట్ ఐడీడీ ల్యాబొరేటరీకి పంపి, ప్రజలు వాడుతున్న ఉప్పులో అయోడిన్ స్థాయిని, శరీరంలో దాని వినియోగాన్ని శాస్త్రీయంగా అంచనా వేయనున్నారు.
ఈ నేపథ్యంలో బలరామునిపేట, నారాయణపురం యూపీహెచ్‌సీల పరిధిలో నిర్వహిస్తున్న సర్వే కార్యక్రమాన్ని కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి (DMHO) డాక్టర్ లోక్నాథ్ దయాకర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులను కలిసి అయోడిన్ లోపం వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు. అయోడిన్ లోపాన్ని పూర్తిగా నివారించేందుకు ప్రతి కుటుంబం తప్పనిసరిగా అయోడిన్ కలిగిన ఉప్పునే వంటలలో ఉపయోగించాలని సూచించారు. మార్కెట్లో అయోడైజ్డ్ ఉప్పును సులభంగా గుర్తించేందుకు ప్యాకెట్‌పై ఉండే ‘స్మైలింగ్ సన్’ (Smiling Sun) లోగోను పరిశీలించాలని పిల్లలకు, ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా ఎన్‌సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ హిమబిందు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వీరేంద్రనాథ్, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు మరియు నారాయణపురం యూపీహెచ్‌సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Slug: machilipatnam-national-iodine-deficiency-survey-dmho-lokanath-dayakar
