జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: మన సాంప్రదాయ ప్రాచీన కళలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అవనిగడ్డ శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ ఉద్ఘాటించారు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం చిట్టూర్పులోని ప్రసిద్ధ శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణంలో కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల స్థాయి తాళం భజన, మురళీ కోలాటం పోటీలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. కొడాలి పీఏసీఎస్ చైర్మన్ గుత్తికొండ వరప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సాంస్కృతిక పోటీలకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి వెలిగించి వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో వేళ్లూనుకున్న తాళం భజన, మురళీ కోలాటం వంటి ప్రాచీన కళలు మన సంస్కృతికి నిజమైన ప్రతీకలని కొనియాడారు. ఆధునికత పోకడల నేపథ్యంలో మరుగున పడుతున్న ఇలాంటి జానపద, ఆధ్యాత్మిక కళలను భావితరాలకు అందించేందుకు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కళాకారులను ప్రోత్సహించడం ద్వారా మన సాంప్రదాయ వైభవం నలుదిశలా వ్యాపిస్తుందని, ఇలాంటి పోటీలు యువతలో కళాభిరుచిని పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. మూడు జిల్లాల నుంచి విచ్చేసిన కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ వేదిక చక్కటి అవకాశమని తెలిపారు.
ఈ ప్రారంభ వేడుకల్లో నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్, ఏఎంసీ చైర్మన్ తోట కనకదుర్గ, నాటక అకాడమీ డైరెక్టర్ పైడిపాముల స్వప్న, డీసీ వైస్ చైర్మన్ పరిశే చలపతిరావు తదితరులు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన కళాకారులు భక్తిభావంతో ప్రదర్శించిన భజనలు, ఉత్సాహభరితమైన కోలాట ప్రదర్శనలు దేవాలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభను నింపాయి. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.
Slug: chitturpu-thalam-bhajan-murali-kolatam-competitions-mla-mandali-buddha-prasad
