జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: కపిలేశ్వరపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘సూర్య చారిటబుల్ హెల్త్ కేర్ సెంటర్’ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన టాలీవుడ్ మెగాస్టార్, పద్మవిభూషణ్ కొణిదల చిరంజీవిని రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు నల్లా చిట్టిబాబు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. మెగాస్టార్ రాకతో స్థానికంగా సందడి నెలకొనగా, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ ప్రియతమ నటుడిని చూసేందుకు ఉత్సాహం కనబరిచారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు నల్లా చిట్టిబాబును అత్యంత ఆప్యాయంగా పలకరించారు. “చిట్టి, ఆరోగ్యం ఎలా ఉంది? జాగ్రత్తగా చూసుకో” అంటూ ఆయన యోగక్షేమాలను ఆరా తీయడం పట్ల చిట్టిబాబుతో పాటు అక్కడున్న అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. కార్యకర్తలు, అభిమానులపై మెగాస్టార్ చూపించే ఈ ప్రత్యేక ఆప్యాయత అందరినీ ఆకట్టుకుంది. ఈ ఆత్మీయ కలయికకు సంబంధించిన విశేషాలు ప్రస్తుతం స్థానికంగా ఎంతగానో చర్చనీయాంశంగా మారాయి.
ఈ కార్యక్రమంలో చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. నల్లా చిట్టిబాబుతో పాటు మెగా అభిమానులు నల్లా నాయుడు, దాట్ల బాబు, పెయ్యల బాబి తదితరులు కూడా మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. అభిమానులతో కాసేపు ముచ్చటించిన చిరంజీవి, అందరికీ అభినందనలు తెలిపారు.
Slug: kapileswarapuram-megastar-chiranjeevi-surya-charitable-health-care-nalla-chittibabu
