జన గళం ఆంధ్రప్రదేశ్ ڈెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురసు’ ప్రభావంతో కోస్తాంధ్ర ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వాయుగుండం తీరానికి అత్యంత సమీపంలోకి వచ్చే క్రమంలో తిరుపతి నుంచి బాపట్ల వరకు ఉన్న కోస్తా తీర ప్రాంతంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా ప్రకాశం, బాపట్ల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ఉత్తర కోస్తాకు ‘అర్ణబ్’ తుఫాను గాలులు, వర్షాలను తెస్తే, ‘మురసు’ మాత్రం దక్షిణ కోస్తాకు భారీగా వర్షాలనే మోసుకొస్తోంది. గత మూడు నెలలుగా తీవ్ర వర్షాభావం, కరవు పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కేవలం 3 రోజుల్లోనే 500 నుండి 600 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసి ఆ లోటును పూర్తిగా భర్తీ చేయనుందని అంచనా వేస్తున్నారు.
దాదాపు 25 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఒక పేరున్న తుఫాను నెల్లూరు వద్ద తీరం దాటబోతుండటం గమనార్హం. వాతావరణ శాఖ ముందస్తు అంచనాల ప్రకారం ఒంగోలు – నెల్లూరు ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసే అవకాశం ఉండటంతో ప్రకాశం జిల్లా పూర్తిగా జలమయం అయ్యే ప్రమాదం ఉంది. దీని ప్రభావంతో విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. స్థానిక యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
