అమరావతి, 2026 సెప్టెంబర్ 20, (జనగళం బ్యూరో):
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సమరం ముంచుకొస్తున్న వేళ జనసేన పార్టీలో సీట్ల కేటాయింపు, క్షేత్రస్థాయి సంస్థాగత బలాబలాలపై ఆసక్తికరమైన రాజకీయ అంతర్మథనం మొదలైంది. “దేవుడు దూరం పెడతాడు అని వాస్తవాలను దాయలేను.. బాధించినా ఆలోచించండి” అంటూ ‘అక్షర సత్యం’ వేదికగా వ్యక్తమైన ఆవేదన ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో విస్తృత చర్చకు దారితీసింది. పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వం పట్ల తిరుగులేని విధేయతను ప్రకటిస్తూనే, క్షేత్రస్థాయిలో పార్టీని బలహీనపరుస్తున్న కొందరు స్వార్థ నాయకుల వ్యవహారశైలిపై నేరుగా ప్రశ్నల బాణాలు సంధించారు.
వివరాలు ఇలా ఉన్నాయి, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ధర్మం ప్రకారం జనసేన పార్టీ 15 శాతం మాత్రమే పోటీ చేసినా, లేదా 3 శాతంలో బరిలోకి దిగినా, లేక కొన్ని చోట్ల పూర్తిగా టీడీపీకి మద్దతు ప్రకటించినా దానిని సమర్థిస్తామని విశ్లేషణలో పేర్కొన్నారు. రేపు సీఎం కుర్చీలో కూర్చోవాల్సిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని, ఆయనను దైవంగా భావించే తమ మద్దతు ఎల్లప్పుడూ ఆయనకే ఉంటుందని తేల్చిచెప్పారు. అయితే, విశేష ప్రజాదరణ, బలమైన కార్యకర్తల సైన్యం ఉన్న జనసేన పార్టీకి “క్షేత్రస్థాయిలో బలం లేదు” అంటూ కొందరు నాయకులు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. నాయకుల స్వార్థం కోసం పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయవద్దని హితవు పలికారు.
ఆ ఏడు ప్రశ్నలకు సమాధానం ఎవరిస్తారు? – కేడర్ ఆవేదన:
క్షేత్రస్థాయిలో రక్తం ధారపోస్తున్న కార్యకర్తల తరఫున నాయకత్వానికి పలు సూటి ప్రశ్నలను సంధించారు:
- ”పార్టీకి బలం లేదు, బలం లేదు అని కొందరు నాయకులు పదే పదే చెప్తున్నారు.. మరి ఇన్నాళ్లూ అధికారంలో ఉంటూ బలం పెంచకుండా మీరేం చేస్తున్నారు?
- ఎన్నో ఏళ్లుగా కొందరే జిల్లా అధ్యక్షులుగా, వాళ్లే నియోజకవర్గ ఇన్‌ఛార్జులుగా, వాళ్లే మండల అధ్యక్షులుగా తిష్టవేశారు.. పార్టీలో మార్పు ఎందుకు లేదు?
- ఏళ్ల తరబడి పాతుకుపోయిన ఆ కొద్దిమంది నాయకులే స్థానికంగా నియంతల్లా మారి సాధారణ కార్యకర్తలపై అజమాయిషీ చెలాయిస్తుంటే ఎందుకు నిలువరించడం లేదు?
- కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యాక, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా కూడా ఇంకా ‘బలం ఉన్న చోట మాత్రమే’ అనే కుంటిసాకులు చెప్పడం ఎంతవరకు న్యాయం?
- పార్టీలో ఏ కొత్త కమిటీ వేసినా ఎప్పుడూ ఆ నలుగురు నాయకులకే ప్రాధాన్యమా.. పార్టీ కోసం పనిచేసే ఇతర నిబద్ధత గల నాయకులు కనిపించడం లేదా?
- అధినేత చుట్టూ తిరిగే తెల్ల చొక్కాలకే పదవులు తప్ప.. ఎండనక, వాననక జెండాలు మోసి చెమటోడ్చిన సామాన్య కార్యకర్తలకు గుర్తింపు ఇంకెప్పుడు దక్కుతుంది?
- అధినేతకు, క్షేత్రస్థాయిలో ప్రాణాలు అర్పించే కార్యకర్తలకు మధ్య ఉన్న ఈ అగాధం ఇంకెన్నాళ్లు కొనసాగుతుంది?” అంటూ నిలదీశారు.
పార్టీని నమ్ముకున్న లక్షలాది మంది జనసైనికుల మనోభావాలను ప్రతిబింబిస్తూ.. ఇప్పటికైనా నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలని, “పార్టీకి బలం లేదు” అనే పలాయనవాదాన్ని వీడి, గ్రామ స్థాయి కార్యకర్తలకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. స్థానిక సమరం వేళ ‘అక్షర సత్యం’ నుంచి వెలువడిన ఈ బహిరంగ విశ్లేషణ రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది.
(న్యూస్ సోర్స్: అక్షర సత్యం)
