జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా అనంతపురం పార్లమెంట్ పరిధిలో సమన్వయ సమావేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడింది. అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ సమావేశానికి జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల ముఖ్య నాయకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, అనంతపురం జిల్లా ఎన్నికల అబ్జర్వర్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి నాయకులతో సుదీర్ఘంగా చర్చించారు. మూడు పార్టీల శ్రేణులు పరస్పర సమన్వయంతో క్షేత్రస్థాయిలో ఐక్యంగా పనిచేయాలని ఈ సమావేశంలో స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
స్థానిక పరిస్థితులు, సమర్థులైన అభ్యర్థుల ఎంపిక, వార్డు స్థాయి సమన్వయం అలాగే ఎన్నికల వ్యూహాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. రాబోయే ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించడమే లక్ష్యంగా కూటమి అభ్యర్థులను గెలిపించే దిశగా ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో చిన్నచిన్న విభేదాలకు తావులేకుండా మూడు పార్టీల శ్రేణులు సమన్వయంతో ముందుకు వెళితే విజయం తథ్యమని నాయకులు అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచార సరళి, వ్యూహాత్మక ప్రణాళికల రూపకల్పనపై కూటమి నేతలు పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ సమావేశంలో జనసేన పార్టీ తరఫున ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షులు, అహుడా చైర్మన్ టి.సి. వరుణ్, జిల్లా ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి జయమ్మ, అనంతపురం నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, కళ్యాణదుర్గం పీవోసీ బాల్యం రాజేష్, గుంతకల్లు పీవోసీ వాసగిరి మణికంఠ పాల్గొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు పూల నాగరాజు, జోనల్ ఇన్‌చార్జ్ రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ హాజరయ్యారు. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ప్రస్తుత జిల్లా అధ్యక్షులు కొండకండ్ల రాజేష్ తదితరులు పాల్గొని ఎన్నికల విజయంపై దిశానిర్దేశం చేశారు.
Slug: anantapur-parliament-nda-alliance-local-bodies-meeting-2026
