జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: అనంతపురం సర్వజన ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చే పేద రోగుల సౌకర్యార్థం జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన వీల్ చైర్ బ్యాంక్ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షులు, అహుడ చైర్మన్ శ్రీ టి.సి. వరుణ్ గారు అనంతపురం సర్వజన ఆస్పత్రికి పది వీల్ చైర్లను అందజేశారు. ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రికి విచ్చేసిన ఆయన రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ సహాయాన్ని అందించారు. జనసేన అధినేత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, స్ఫూర్తితో పేద రోగులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అనంతపురం డిస్కవరీ శ్రీ అనిల్ కుమార్ గారి సహకారాన్ని ప్రత్యేకంగా అభినందించిన టి.సి. వరుణ్, ఆస్పత్రి అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఆసుపత్రికి వచ్చే మహిళల సౌకర్యార్థం త్వరలోనే పింక్ టాయిలెట్ల నిర్మాణాన్ని పూర్తి చేసి తీరుతామని ఆయన ప్రకటించారు. ఆస్పత్రిలో మౌలిక వసతుల కల్పనకు, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా జనసేన శ్రేణులు నిరంతరం కృషి చేస్తాయని తెలిపారు.
టి.సి. వరుణ్ అందజేసిన పది వీల్ చైర్లను స్వీకరించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీమతి మల్లీశ్వరి గారు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆస్పత్రికి వచ్చే వృద్ధులు, దివ్యాంగులు మరియు నడవలేని రోగులకు ఈ వీల్ చైర్లు ఎంతగానో ఉపయోగపడతాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగర, జిల్లా కమిటీ సభ్యులు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Slug: anantapur-sarvajana-hospital-tc-varun-wheelchairs-donation
