జన గళం అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. స్థానిక ఎన్నికల లక్ష్యంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రత్యేక “అడ్-హాక్ కమిటీల”ను ఏర్పాటు చేశారు. ఎన్నికల సమగ్ర నిర్వహణ కోసం నియమించే ఈ అడ్-హాక్ కమిటీలో ముగ్గురు పార్లమెంట్ స్థాయి నేతలతో పాటు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముగ్గురు నాయకులను నియమించారు. వీరికి క్షేత్రస్థాయిలో పూర్తి సహకారం అందించేందుకు ప్రత్యేకంగా ‘నిర్వాహక్ దళ్’ బృందాన్ని రంగంలోకి దించారు.
క్షేత్రస్థాయిలో పార్టీ సంస్థాగత బలం, కేడర్ పనితీరు, స్థానిక ప్రజా సమస్యలు, గెలుపు గుర్రాలైన ఆశావాహుల వివరాల సేకరణతో పాటు కూటమి పార్టీలతో సమన్వయాన్ని ఈ కమిటీలు పర్యవేక్షించనున్నాయి. సేకరించిన సమగ్ర సమాచారాన్ని నివేదికల రూపంలో పార్టీ కేంద్ర కార్యాలయానికి అందజేస్తాయి. ఈ కమిటీల పనితీరును పవన్ కళ్యాణ్ స్వయంగా పర్యవేక్షిస్తూ, త్వరలోనే సభ్యులతో ముఖాముఖి భేటీ నిర్వహించి ఎన్నికల కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు.
Slug: janasena-parliamentary-adhoc-committees-local-body-elections-pawan-kalyan-strategy
