జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామంలో పేదల సేవలో 2.0 కార్యక్రమాన్ని గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము అత్యంత ఘనంగా నిర్వహించారు. పీ-4 కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన ఆరు బంగారు కుటుంబాలకు మెయిల్ సంస్థ ఆర్థిక సహకారంతో వివిధ జీవనోపాధి సాధనాలను పంపిణీ చేశారు. లబ్ధిదారులకు నాలుగు ఆటో రిక్షాలు, ఒక ఐస్‌క్రీమ్ బండి మరియు ఒక మోటార్ రిక్షాను కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను వాహనాల్లో ఎక్కించుకున్న ఎమ్మెల్యే రాము స్వయంగా వాహనాలను నడిపి వారికి అందించడం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అంతకుముందు బంగారు కుటుంబాలతో ఎమ్మెల్యే రాము ముఖాముఖిగా మాట్లాడి వారి కుటుంబ పరిస్థితులు, ఉపాధి అవకాశాలు మరియు అవసరాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. సభా వేదికపై ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు కేవలం ఆర్థిక సహాయం అందించడం మాత్రమే కాకుండా, వారు తమ కాళ్లపై తాము నిలబడేలా స్థిరమైన ఉపాధి అవకాశాలను కల్పించడమే పీ-4 కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి కుటుంబంలో కనీసం ఒకరు ఉద్యోగి లేదా వ్యాపారవేత్తగా ఎదగాలని, అవకాశాలు అందని కుటుంబాలకు ఉన్నత స్థాయిలో ఉన్నవారు సహకారం అందించి వారిని ఆర్థికంగా పైకి తీసుకురావాలని ఆకాంక్షించారు. ఒక కుటుంబానికి అందించిన సహాయం ఆ కుటుంబానికే పరిమితం కాకుండా, ఆ కుటుంబం స్వయం సమృద్ధి సాధించి మరో కుటుంబానికి చేయూతనిచ్చే స్థాయికి ఎదగడమే నిజమైన సామాజిక భాగస్వామ్యమని ఆయన స్పష్టం చేశారు.
పి-4 కార్యక్రమాన్ని మండలంలో విజయవంతంగా అమలు చేసేందుకు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందిస్తున్న మెగా కృష్ణారెడ్డికి ఎమ్మెల్యే రాము ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక పారిశ్రామికవేత్తలు, ఉన్నత స్థాయిలో ఉన్న ప్రముఖులు తమ గ్రామాలు మరియు ప్రాంతాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పి-4 కార్యక్రమం ద్వారా జరుగుతున్న సానుకూల పరిణామాలను పరిశీలిస్తూ ఇతర రాష్ట్రాలు కూడా ఇటువంటి కార్యక్రమాల అమలుపై దృష్టి సారిస్తున్నాయని తెలిపారు. తమ కుటుంబాలకు ఆర్థికంగా భరోసా కల్పించేలా జీవనోపాధి సాధనాలను అందించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు, మెయిల్ సంస్థకు మరియు కూటమి ప్రభుత్వానికి లబ్ధిదారులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, కూటమి నాయకులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
Slug: dokiparru-peedala-sevalo-mla-venigandla-ramu-p4-program
