జన గళం క్రైమ్ డెస్క్: ఎర్రుపాలెం మండలం పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బనిగండ్లపాడు మరియు బుచ్చిరెడ్డిపాలెం గ్రామాల మధ్య ఉన్న గుట్ట ప్రాంతంలో రెండు బైకులు ఎదురురెదురుగా వేగంగా వచ్చి తీవ్రంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో ప్రయాణిస్తున్న చిన్నపిల్లల పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం బనిగండ్లపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని ఎన్టీఆర్ జిల్లా పుల్లూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా ప్రాథమికంగా గుర్తించారు. అయితే మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు, ప్రమాద సమయంలో బైకులపై ఉన్న మిగతా వారి వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురుగా వేగంగా ఢీకొనడంతో వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికంగా తీవ్ర భయాందోళన వాతావరణం నెలకొంది. సమాచారం తెలుసుకున్న వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టి పోలీసులకు సమాచారం అందించారు.
ఈ ఘోర ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా చూస్తూ, ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో ఆరా తీస్తున్నారు. బనిగండ్లపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నపిల్లలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ అకస్మాత్తు ప్రమాదంతో మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.
Slug: errupalem-mandal-bike-accident-banigandlapadu
