జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే గొప్ప సేవ మరొకటి లేదని, తోటి వారికి సాయం చేయడం ద్వారానే నిజమైన సంతృప్తి లభిస్తుందని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి మెట్ల మార్గం వద్ద శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అమావాస్య అన్నదాన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా భక్తులకు స్వయంగా అన్నం వడ్డించి, ట్రస్ట్ ద్వారా గత ఐదేళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతున్న సేవా కార్యక్రమాలను ఆమె అభినందించారు.
ప్రతి నెలా అమావాస్య రోజున సుమారు మూడు వేల మందికి పైగా భక్తులకు అన్నప్రసాదం అందజేయడం అభినందనీయమని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తెలిపారు. ఈ సేవలను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగిస్తున్న ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావును, అలాగే ఇందులో భాగస్వాములవుతున్న ట్రస్ట్ సభ్యుల నిస్వార్థ సేవలను ఆమె ప్రత్యేకంగా ప్రశంసించారు. సమాజంలో ఇలాంటి సేవాభావం కలిగిన వ్యక్తులు, సంస్థలు ముందుకు రావడం వల్ల నిరుపేదలకు, భక్తులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు గుత్తికొండ ధనుంజయరావు మాట్లాడుతూ, మంగళగిరిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని, దీనికోసం రూ. 150 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దాతల సహకారంతో ప్రతి నెలా వేలాది మంది భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్న ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు. ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు మాట్లాడుతూ భక్తులు, దాతల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, గుత్తికొండ ధనుంజయరావులను ట్రస్ట్ సభ్యులు ఘనంగా సత్కరించగా, పలువురు ప్రముఖులు, నాయకులు, ట్రస్ట్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Slug: guntur-mangalagiri-sri-kashi-annapoorneswari-seva-trust-annadanam-mlc-panchumarti-anuradha
