జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ స్థాయిలో కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. గతంలో అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా వ్యవహరించిన ఆయన, అధికారం కోల్పోయిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో కేంద్ర వైఖరికి అనుగుణంగానే నడుచుకున్నారు. అయితే దేశ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు, జాతీయ స్థాయిలో మసకబారుతున్న బీజేపీ ప్రభావం అలాగే ఎన్నికల ప్రక్రియలో జరిగిన అక్రమాలపై తానే స్వయంగా బాధితుడిగా మారడం వంటి పరిణామాలు ఆయనను పునరాలోచనలో పడేసినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఎన్నికల అక్రమాలు మరియు ప్రజాస్వామ్య పరిరక్షణ అంశాలపై జాతీయ స్థాయిలో గట్టిగా గళం వినిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి వైపు జగన్ మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మినహా దాదాపు అన్ని చోట్లా ప్రాంతీయ పార్టీలతో లేదా ప్రత్యక్షంగా బలపడిన కాంగ్రెస్ పార్టీ, ఏపీలోనూ రాజకీయ సమీకరణాలను మార్చేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జగన్‌ను తమ వైపు తిప్పుకునేందుకు లేదా జాతీయ స్థాయిలో విపక్ష కూటగితో కలిసి పోరాడేందుకు తగిన సంకేతాలు వెలువడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసిపికి జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టుకోవడం ద్వారా భవిష్యత్ రాజకీయ వ్యూహాలను పకడ్బందీగా అమలు చేయాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమితో సఖ్యత ఏర్పడితే అది రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై వైసిపి అధిష్టానం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడనప్పటికీ, వస్తున్న ఈ ఊహాగానాలు మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో ఏపీ మాజీ సీఎం తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Slug: jagan-mohan-reddy-india-alliance-rumors-ap-politics
