జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: సోలార్ విద్యుత్తు వినియోగాన్ని పెద్దఎత్తున ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సేవాసేతు అభియాన్’ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం అవనిగడ్డలోని తన కార్యాలయంలో సేవాసేతు అభియాన్‌కు సంబంధించిన ప్రత్యేక కరపత్రాలను ఆయన అధికారికంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని విద్యుత్ వినియోగదారుల కోసం తలపెట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు.
ఈ నెల 6, 7, 8 తేదీలలో నియోజకవర్గ పరిధిలోని విద్యుత్ వినియోగదారుల సౌలభ్యం కోసం ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల వినియోగదారుల కోసం అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో, అలాగే చల్లపల్లి, ఘంటసాల, మోపిదేవి మండలాల వినియోగదారుల కోసం చల్లపల్లిలోని చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. పీఎం సూర్య ఘర్ సోలార్ విద్యుత్తు వినియోగంపై అవగాహన కల్పించడం, దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు ఈ సింగిల్ డెస్క్ విధానం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఈ మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులతో పాటు వివిధ బ్యాంకుల అధికారులు కూడా ప్రత్యక్షంగా పాల్గొని, వినియోగదారులకు అవసరమైన రుణ సదుపాయాలను సులభంగా కల్పిస్తారని తెలిపారు. ప్రభుత్వం అందించే సబ్సిడీ సదుపాయాన్ని వినియోగించుకుని సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రత్యామ్నాయంగా విద్యుత్ ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో చల్లపల్లి ఏడీఈ పేర్ని రవికుమార్, ఘంటసాల ఏఈ పిరియా రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Slug: mandali-buddha-prasad-sevasetu-abhiyan-solar-avanigadda
