జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: తిరుపతి పట్టణంలోని శ్రీ బాబు జగజీవన్ రామ్ భవన్ వేదికగా మాదిగ దళ పోరాట సమితి ఎండీపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం తీవ్ర ఉత్కంఠ మధ్య ముగిసింది. ఎండీపీఎస్ వ్యవస్థాపకులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పెద్దపల్లి శేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాయలసీమ జిల్లాల నుండి నూతన కోర్ కమిటీ సభ్యుల నియామకం మరియు జాతి సంక్షేమంపై కీలక చర్చ జరిగింది. ఈ సందర్భంగా గత వైసిపి ప్రభుత్వ హయాంలోనూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలోనూ మాదిగలకు జరుగుతున్న అన్యాయాలు, దాడులు మరియు హత్యలపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టారు. గత ప్రభుత్వంలో సుమారు రెండు వందల మంది మాదిగలు హత్యకు గురైతే, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనూ అదే ధోరణి కొనసాగుతూ సుమారు ఇరవై మందికి పైగా మాదిగలు హత్యలకు బలయ్యారని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో మాదిగలకు ఎక్కడా రక్షణ లేకుండా పోయిందని, అగ్రవర్ణాల వారికి ఏ చిన్న అన్యాయం జరిగినా వెంటనే స్పందించి పరిహారం ప్రకటించే ప్రభుత్వాలు, మాదిగలపై దాడులు జరిగితే కనీసం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు స్వీకరించని దుస్థితి నెలకొందని పెద్దపల్లి శేఖర్ మండిపడ్డారు. గత ఎన్నికల్లో మాదిగల ఓట్లను దండుకుని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా తన ధోరణి మార్చుకోకపోతే, వచ్చే స్థానిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మాదిగలను ఏకం చేసి ఓటు ద్వారా తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. గత ముప్పై ఏళ్లుగా ఎన్నో ప్రజా సంఘాలు వచ్చినా స్వలాభం కోసమే పనిచేశాయి తప్ప మాదిగ జాతి అభివృద్ధిని పట్టించుకోలేదని, ఇకనైనా అందరూ ఏకమై హక్కుల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న మాదిగ అధికారులను కూడా రాజకీయంగా కొందరు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో రాయలసీమ జిల్లాలకు సంబంధించి ఆరుగురిని నూతన ఎండీపీఎస్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులుగా నియమించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సభ్యులు దొడ్డి సురేష్, సుండుపల్లి రవి, సద్దాల హరి, బద్వేల్ సుదర్శన్ రావు తదితరులకు జాతి అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. మాదిగలు అగ్రవర్ణాలతో పోటీపడి అన్ని రంగాల్లో ఉన్నత స్థానాలకు ఎదిగేలా, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి అందేలా క్షేత్రస్థాయిలో కృషి చేయాలని ఆదేశించారు. జాతి బిడ్డలకు ఏ సమస్య వచ్చినా ఎండీపీఎస్ వారి వెన్నంటి ఉండి న్యాయం చేస్తుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి సివి రమణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పురుషోత్తం, తిరుపతి జిల్లా అధ్యక్షులు గురుశంకర్ ప్రసాద్, మహిళా అధ్యక్షురాలు శశిరేఖ, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు పెద్దపల్లి అశోక్ కుమార్ తో పాటు పలువురు జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
Slug: mdps-state-core-committee-meeting-tirupati-peddapalli-sekhar
