జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో విద్యుత్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన, నమ్మకమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రవాణా, యువజన మరియు క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాయచోటి డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో కొనసాగుతున్న విద్యుత్ అభివృద్ధి పనులు, నూతన విద్యుత్ ఉపకేంద్రాల ఏర్పాటు, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ ఆధునీకరణ మరియు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించిన అంశాలపై అధికారులతో సమగ్రంగా చర్చించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
రాయచోటి నియోజకవర్గంలో విద్యుత్ సరఫరా సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు రెండు నూతన విద్యుత్ ఉపకేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. గాలివీడు మండలం అరవీడు వద్ద మూడు కోట్ల రూపాయల వ్యయంతో, రాయచోటి మండలంలోని మార్కెట్ యార్డ్ వద్ద మరో మూడు కోట్ల రూపాయల వ్యయంతో నూతన విద్యుత్ ఉపకేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ రెండు ఉపకేంద్రాల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లో లోడ్ సమస్యలు పూర్తిగా తొలగిపోయి ప్రజలకు నిరంతర విద్యుత్ అందుబాటులోకి వస్తుందని, ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయిందని త్వరలోనే పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అలాగే రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో పాత మౌలిక వసతుల పునరుద్ధరణకు పది కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, దెబ్బతిన్న స్తంభాలు, కేబుల్స్ మార్చి వ్యవస్థను పటిష్టం చేయనున్నట్లు తెలిపారు.
వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతులకు విద్యుత్ కనెక్షన్ల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. గత ఎనిమిది నెలల్లో పద్దెనిమిది కోట్ల రూపాయల వ్యయంతో నాలుగు వందల యాభై వ్యవసాయ డిటిఆర్లను జారీ చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం ఉన్న సీనియారిటీని రెండున్నర సంవత్సరాల నుంచి కేవలం ఆరు నెలలకు తగ్గించామని, దీంతో రైతన్నలకు మరింత త్వరగా కనెక్షన్లు అందే అవకాశం ఏర్పడిందని చెప్పారు. భవిష్యత్తులో పెరిగే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో పనులు చేపడుతున్నామని, అధికారులు సమన్వయంతో వ్యవహరించి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించారు.
Slug: minister-mandipalli-ramprasad-reddy-reviews-power-system-in-rayachoti
