జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్లో మద్యం దుకాణాల లైసెన్సుల పునరుద్ధరణకు నేడు చివరి గడువు. 2026–27 సంవత్సరానికి ఇప్పటికే ఉన్న మద్యం దుకాణాల లైసెన్సులను మరో ఏడాది కొనసాగించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. సెప్టెంబర్ 21తో పునరుద్ధరణ గడువు ముగియనుంది. రాష్ట్రంలో మొత్తం 3,736 మద్యం దుకాణాలు ఉన్నాయని తాజా వివరాలు వెల్లడిస్తున్నాయి.
సెప్టెంబర్ 20 సాయంత్రం నాటికి సుమారు 2,931 దుకాణాలు పునరుద్ధరణకు ముందుకు వచ్చినట్లు తాజా నివేదికలు పేర్కొన్నాయి. వీటిలో 1,458 దుకాణాలు పూర్తి రుసుము చెల్లించగా, 655 దుకాణాలు పాక్షికంగా చెల్లింపులు చేశాయి. మరో 382 దుకాణాలు పూర్తి చెల్లింపు చేసినప్పటికీ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంది. ఇప్పటివరకు 2,113 దుకాణాలకు సంబంధించి చెల్లింపులు జరగగా, రూ.754.1 కోట్ల ఆదాయం సమకూరినట్లు సమాచారం.
లైసెన్సుల పునరుద్ధరణకు నేడు చివరి అవకాశం కావడంతో మిగిలిన దుకాణాల విషయంలో అధికారులు ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. గడువులోగా పునరుద్ధరణకు దరఖాస్తు చేయని దుకాణాలను కొత్తగా కేటాయించే ప్రక్రియలోకి తీసుకెళ్లనున్నారు. కొత్త దరఖాస్తులకు సెప్టెంబర్ 22 నుంచి 29 వరకు అవకాశం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. సెప్టెంబర్ 30న లాటరీ ద్వారా కొత్త లైసెన్సీలను ఎంపిక చేయనున్నారు.
2026–27 మద్యం దుకాణాల లైసెన్స్ కాలం అక్టోబర్ 1, 2026 నుంచి సెప్టెంబర్ 30, 2027 వరకు కొనసాగనుంది. ప్రస్తుతం ఉన్న లైసెన్సులను పునరుద్ధరించేందుకు వార్షిక రిటైల్ ఎక్సైజ్ పన్నుతో పాటు పునరుద్ధరణ రిటైల్ ఎక్సైజ్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
