జన గళం ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సమాయత్తమైంది. గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించగా, పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థలు, నగర పంచాయతీలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేశారు. నోటిఫికేషన్ లేదా షెడ్యూల్ వెలువడిన సమయం నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని తెలిపారు. నోటిఫికేషన్ వచ్చిన 14 రోజుల్లోనే గ్రామ పంచాయతీల ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని, పోలింగ్ ముగిసిన రోజే మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. పురపాలక ఎన్నికలు 15 రోజుల్లో, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు 16 రోజుల్లో పూర్తి చేసి, పోలింగ్ ముగిసిన రెండు రోజుల తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా, మిగిలినవన్నీ పార్టీ గుర్తులపైనే జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,05,432 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశామని, అవసరార్థం తెలంగాణ నుంచి 17,650 బాక్సులను రప్పించామని కమిషనర్ వివరించారు.
స్థానిక సంస్థల ఎన్నికల నగారా: పంచాయతీలకు 3 దశలు.. పురపాలకానికి ఒకే విడత!
Slug: ap-local-body-elections-schedule-panchayat-municipal-mptc-zptc-sec-anil-chandra-punetha
