జన గళం మచిలీపట్నం డెస్క్: తన కుమారుడు కిషన్ తేజ్‌కు మచిలీపట్నం (బందరు) నగరపాలక సంస్థ మేయర్ పదవి ఇప్పించేందుకు తాను ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగా ఒక పత్రికలో ప్రచురితమైన కథనాలను తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ ఉప సభాపతి శ్రీ బూరగడ్డ వేదవ్యాస్ తీవ్రంగా ఖండించారు. ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు.
మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు గానీ, తన కుమారుడు కిషన్ తేజ్‌కు గానీ మేయర్ పదవిని ఆశించే ఆలోచన ఎంతమాత్రం లేదని కుండబద్దలు కొట్టారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో పదవుల కోసం ఎన్నడూ వెంపర్లాడలేదని, పైరవీలు చేయలేదని తెలిపారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తగా తాను ఎల్లప్పుడూ పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాల మేరకే నడుచుకుంటానని స్పష్టం చేశారు. నిరాధారమైన, కల్పిత వార్తలతో ప్రజలను, పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేయవద్దని ఆయన హితవు పలికారు. కూటమి ప్రభుత్వ విజయాలు, పార్టీ బలోపేతమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని బూరగడ్డ వేదవ్యాస్ పేర్కొన్నారు.
