రచన: జన గళం అమరావతి డెస్క్: ఒకప్పుడు కరువు కాటకాలతో అల్లాడిన రాయలసీమ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేసి, సస్యశ్యామలమైన “సిరుల సీమ”గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు ఉద్యమ స్ఫూర్తితో భాగస్వాములైతేనే ప్రతిష్టాత్మక ‘స్వర్ణాంధ్ర-2047’ లక్ష్యం సాకారమవుతుందని స్పష్టం చేశారు.
మరోవైపు హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) వ్యాపార రంగానికి అంతర్జాతీయ గ్లోబల్ బ్రాండ్‌గా ఎదిగినట్లే, మదనపల్లెలో ఏర్పాటు చేయనున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ISA) రాయలసీమతో పాటు రాష్ట్ర వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్-1 స్థానంలో నిలపడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ఇందుకు ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరమన్నారు. ఇదే సమయంలో పారిశుద్ధ్యంపై ప్రజా చైతన్యాన్ని చాటుతూ మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని ‘స్వచ్ఛ పాఠశాల’ కార్యక్రమంలో 170 పాఠశాలల నుంచి 35 వేల మంది విద్యార్థులు ఏకతాటిపై నిలిచి 75 వేల కిలోల పొడి చెత్తను సేకరించడం ద్వారా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకోవడంపై ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది.
